గంగావతరణం(5)

శివుడు, భగీరథుడు, దేవతలు, బ్రహ్మ అందరూ హిమాలయపర్వతాలకు వెళ్తారు. శివుడు తన రెండు చేతులను నడుము మీద వేసుకుని జటజూటం విప్పి నిల్చున్నాడు. అలా శివుడు తన జటలను విప్పి నిలబడగానే ఆకాశం నుండి క్రిందకు పడమని బ్రహ్మదేవుడి ఆజ్ఞ. 

అందుకని గంగ మంచిప్రవాహంతో ఆకాశం నుండి బయలుదేరింది. చాలా వేగంగా వచ్చేస్తోంది. క్రింద నిల్చున్న పరశివుడిని చూసి నవ్వుకుంది. తన ప్రవాహ బలం తెలియక, శివుడు జటాజూటంలో బంధించడానికి నిలబడ్డాడు, తాను ఒక్కసారి క్రిందకు దూకితే ఆ శివుడి తల బద్దలవుతుందని, ఈ శివుడిని తన ప్రవాహవేగంతో పాతాళానికి ఈడ్చుకుపోవాలని అనుకుంది. తన ప్రతాపం చూపిద్దాం అని మొసళ్ళతో, తాబేళ్ళతో, ఎండ్రకాయలతో, కప్పలతో పడిపోదామని అని నిశ్చయించుకుంది. 

ఈ విషయం పరమశివుడికి తెలిసింది.  అందరిలోనూ ఆత్మగా ఉన్నది శివుడే. మనం చేసే ప్రతి కర్మకు సాక్షి ఆ పరమశివుడు. మనం ఏదో పని చేసి, అది దేవుడికి తెలియదనుకుంటే అది మన అజ్ఞానమే అవుతుంది. మనం చేసే ప్రతిపని, ఆలోచన, మాట్లాడే ప్రతి మాట కూడా ఆ పరమాత్మకు తెలుస్తాయి. . అలాగే పరమశివునకు గంగ మనసులో ఉన్న భావం అర్ధమైంది. గంగ అహకారాన్ని అణచాలనుకున్నాడు. అందుకే హిమాలయాలంతా పరమపవిత్రమైన తన జటాజూటాన్ని(జడలను) పెద్దగా విస్తరించాడు శివుడు. 

అంతే గంగ ఒక్కసారిగా ఆకాశం నుండి శివుడు జటాజూటం లోనికి దూకింది. దూకూతూ నేను శివుడను పాతాళానికి ఈడ్చుకుపోతాననుకుంది. ఒక సంవత్సరం గడిచింది. దేవతలూ, బ్రహ్మ, భగీరథుడు అందరూ గంగ క్రిదకు పడుతుందేమో అని ఎదురు చూస్తున్నారు. ఎంత కాలం చూసినా ఒక్క చుక్క కూడా క్రిందపడలేదు. 

శివుడు విప్పిన జటాజూటాంలో గంగ సుడులు తిరుగుతూ ఒక సంవత్సరంపాటు ఉండిపోయింది. ఎంత నీరు పడినా, ఒక్క చెమటచుక్క పరిణామంలో కూడా గంగ కిందకు పడలేదు. దేవతలు, బ్రహ్మదేవుడు, భగీరథుడు గంగ క్రిందకు పడుతుందని ఆకాశం వైపు చూస్తున్నారు. భగీరథుడు వేచిచూసి బ్రహ్మ దేవుడిని అడుగగా, శివుడు గంగ అహకారం తొలగించడానికి ఆమెను తన జటాజూటంలో బంధించాడని చెప్పాడు.  

మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు భగీరథుడు. తపస్సు చేసి, శివా! గంగ రోషం బాగానే ఉంది. నీ
ప్రతాపమూ బాగుంది. ఇప్పటికైనా గంగను విడిచిపెట్టు అన్నాడు. భగీరథుడి మాటలు విన్న పరమశివుడు గంగను హిమాలయ పర్వతాలలో బ్రహ్మదేవుడి చేత నిర్మించబడిన బిందు సరోవరంలో పడేలా విడిచిపెట్టాడు. శివుడు తన జటాజూటంలో ఉన్న గంగను విడిచిపెట్టాగానే గంగా పెద్దశబ్దం చేసుకుంటూ, మొసళ్ళతో, ఎండ్రకాయలతో, చేపలు, పాములతో సుడులు తిరుగుతూ, మంచి నురుగుతో, ఆ శబ్దం విన్నా, చూసినా భయం వేసేంత ప్రవహంతో గంగ భూమి మీద పడింది.

నదుల యొక్క మార్గాన్ని నిర్దేశించగల అధికారం ఒక్క బ్రహ్మదేవుడికే ఉంది. సృష్టి ప్రారంభంలో ఆయనే నది ప్రవాహ మార్గాన్ని నిర్దేఇంఛాడు. భగీరథుడు రధాన్ని అనుసరించమని గంగను వెళ్ళమని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. గంగ భగీరథుని రధం వెనుకాలే వెళ్ళింది. 

మాంచి ఎండాకాలంలో మనకు త్రాగునీరు రానప్పుడు మన ప్రక్కవీధిలోకి ఒక ప్రభుత్వ ట్యాంకరు వస్తోంది అని తెలియగానే, అన్ని పనులు వదిలేసి జనం నీటి బిందేలు పట్టుకుని ఎలా పరిగెడతారో, అదే విధంగా గంగ భూమి మీదకు పడిందనగానే దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషులు, ఋషులు, మునులు, మనష్యులు, పాపం చేసి నరకలోకంలో శిక్షలు అనుభవిస్తున్నవారు, అందరూ ఆ గంగలో స్నానం చేయడానికి, గంగ నీటిని త్రాగడానికి పరుగులుతీస్తున్నారు.  

మహామహా పాతకాలు చేసినవారు గంగలో స్నానం చేయగానే వాళ్ళ పాపరాశి కాలిపొయి మంచి శరీరాలను పొంది దేవలోకాలకు వెళ్ళిపోతున్నారు.ఆ ప్రవాహ వేగాన్ని తట్టుకోలేనివారు, ముసలివారు స్నానం చేయడం కష్టమని గంగ నీటిని తలమీద చల్లుకుంటున్నారు. వారు వెంటనే ఊర్ధ్వలోకాలు వెళ్ళీపోతున్నారు. గంగలో స్నానం చేయడం ఆలస్యం, మంచి శక్తులను పొంది, పవిత్రులై ఆకశంలోకి ఎగిరిపోతున్నారు. 

గంగ ఇంత పవిత్రమైంది ఎందుకు? శివుడు శరీరాన్ని తాకింది, ఆయన జటాజూటం నుంచి పడింది. పరమశివుడిని తాకడం వలన గంగ పరమపవిత్రమై, గంగను ఇతర జలాలో స్మరించినంత మాత్రం చేతనే, ఇతర జలాలను కూడా పవిత్రం చేయగల శక్తి లభించింది. 

ముందు భగీరథుడు రథం మీద వెళ్తున్నాడు, ఆయన రథాన్ని గంగ అనుసరిస్తోంది.దేవతలందరూ ఆకాశంలో గంగ ప్రవాహం వెనుక వెళ్తున్నారు. బంగారం వంటి రంగుతో, పెద్ద శబ్దంతో, మంచి పొంగుతో, అలలతో, పక్కన ఉన్న నేలను తుంపర్లతో తడుపుకుంటూ ఆయన ఎటు వెళ్తే గంగ అటు వెళ్తోంది.  

ఇలా సాగిపొతున్న గంగ ప్రవాహం శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. భగీరథుడు వెనక్కి తిగి చుశాడు కాని గంగ కనిపించలేదు.