గంగావతరణం(3)

ఏదైన దీక్ష తీసుకునే ముందు చేతికి కంకణం కడతారు. అది దీక్ష పూర్తయ్యేవరకు తీయకూడదు. అటువంటి సమయంలో బంధువుల మరణాల కారణంగా వచ్చిన సూతకం ఆ దీక్షపరుడికి ఉండడు. దీక్ష ముగిసిన తరువాత సాధరణంగా సూతకం ఎన్నిరోజులుంటుందో అన్ని రోజులు పాటించాలి. సగరచక్రవర్తి తన 60,000 మంది సగరులను పిలిచి, తాను కంకణం ధరించాడు కనుక యాగం మధ్యలో లేవకూడదని, ఇంద్రుడు తన పదవి కోసం అశ్వాన్ని దొంగిలించుంటాడు. అందువల్ల భూగోళమంతా గాలించమని ఆజ్ఞాపించాడు. అంతా వెతికినా గుర్రం కనపడక తిరిగివచ్చారు సగరులు. భూగోళమంతాట వెతికినా కనపడలేదన్నారు. 

ఇంద్రుడు అశ్వాన్ని పాతాళంలో దాచిఉంటాడని గ్రహించి మీరు 60,000 మంది ఉన్నారు, ఈ భూగోలమంతా మీ 60,000 మంది 60,000 యోజనాలు వెతకండి అన్నాడు సగర చక్రవర్తి. ఎలా వెతుకుతారో తెలుసా? మీకు వజ్రముల వాంటి గోర్లున్నాయి. ఒక్కొక్కరు ఒక్క యోజనం చొప్పున 60,000 యోజనాల భూమినిలో ఉన్న మట్టిని పెకిలించండి, భూమిని నాగళ్ళు పెట్టి తవ్వేయండి, గునపాలతో చీల్చేయండి, పాతాళానికి వెళ్ళి గుర్రాని తీసుకురండి అన్నాడు సగర చక్రవర్తి. 60,000 మంది భూమిని తవ్వడం, చీల్చేయడం మొదలుపెట్టారు. 

ఇది చూసిన దేవతలు పరుగుపరుగున బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళారు. ఈ భూగోళమంతా దైవశక్తులు ఉంటాయి. పంచమహాభూతాలు (ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి/పృధ్వీ ) ఉంటాయి.  

చెట్లను ఆకారణంగా నరికేయడం, కుదురుగా ఉండలేక పువ్వులు, మొగ్గలు, ఆకులు తెంపడం, పంచభూతాలకు ఇబ్బంది కలిగించడం అంటే కలుషితం చేయడం వంటివి శాస్త్రం నిషేధించింది ( మనం కూడా ఇప్పుడు అదే చేస్తున్నాం. భూమిని రోజురోజుకు వెడెక్కిస్తున్నాం, ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు పడేస్తున్నాం, నదులను, గాలిని, ఆకాశాన్ని, భూమిని కలుషితం చేస్తున్నాం. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా వాడేస్తున్నాం, ప్రకృతిని దోచేస్తున్నాం, భూతాపాన్ని పెంచేస్తున్నాం). ఇవన్ని దేవతలు అపచారం చేయడమే. అందుకే పర్యావరణాన్ని పరిరక్షించండి. వారు వారి ధర్మాన్ని పాటించడం మరిచిపోయి, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా వెళ్ళారు. అందుకే 12 మంది ఆదిత్యులు, 11 రుద్రులు, అష్ట (8) వసువులు, 2 అశ్విని దేవతలు వెళ్ళారు. వీరందరూ కలిపి 33. మొత్తం 33 కోట్ల;దేవతాగణాలు సగరులు చేస్తున్న అకృత్యాన్ని సహించలేక పరుగుపరుగున బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. శ్రీ మహావిష్ణువు(వాసు దేవుడు) కపిల మహర్షి రూపంలో ఈ భూమండలాన్ని కాపాడుతున్నాడు. వీళ్ళు చేస్తున్న దుష్కృత్యం వలన ఆయన తపిస్తున్నాడు. 

 ఇలాంటి పనులు చేసేవారి ఈరోజు కాకపోయిన ఏదో ఒక రోజు ఆయన ఆగ్రహానికి గురై భస్మం అయిపోతారు, వాళ్ళు అల్పా ఆయువు కలవారు,  పంచభూతముల జోలికి అనవరసంగా వెళ్ళి, వాటికి అపకారం చేసేవారి ఆయుర్దాయం(జీవిత కాలం) క్షీణిస్తుంది . అందువల్ల మీరు ఆవేశపడకండి అని బ్రహ్మదేవుడన్నాడు, దేవతలు తిరిగి వెళ్ళిపోయారు.  వాళ్ళు అవిధంగా తవ్వి లోపలకు వెళ్తుంటే, వారికి అడ్డువచ్చిన పాములను, మనుషులను, అల అడ్డువచ్చిన ప్రతిజీవిని చంపుకుంటూ వెళ్ళారు. మొదట వారు తూర్పు దిక్కుకు వెళ్ళారు. అక్కడ విరూపాక్షం అనే ఏనుగు ఉంది. అది తన కుంభస్థలం మీద తూర్పు దిక్కున ఉన్న భూమండాలాన్ని మోస్తోంది. మన భూమిని అష్టదిగ్గజాలు మోస్తుంటాయని ఋషులు చెప్పారు. అందులో ఒకటి ఈ విరూపాక్షం. దానికి ఒక్కొక్కసారి దాని కుంభస్థలం నొప్పి పెడితే అది ఒకసారి తన కుంభస్థలాన్ని కదుపుతుంది. అప్పుడు తూర్పుదిక్కున భూకంపాలు వస్తాయని రామాయణంలో ఉంది. దాని చుట్టు ప్రదక్షిణం చేసి, నమస్కరించారు.  

దక్షిణ దిక్కుకు వెళ్ళారు. అక్కడ మహాపద్మం అనే ఏనుగు దక్షిణ దిక్కున ఉన్నభూమిని మోస్తోంది. దాని చుట్టు ప్రదక్షిణం చేసి, నమస్కరించారు. అటు తరువాత పడమర దిక్కుకు వచ్చారు. అక్కడ సౌమనసం  అనే ఏనుగు పశ్చిమ దిక్కన గల భూమిని మోస్తోంది. దానికి ప్రదక్షిణం, నమస్కారం చేశారు. అక్కడి నుండి ఉత్తర దిక్కుకు వెళ్ళారు. భధ్రం అనే ఏనుగు ఉత్తర దిక్కు భూమిని మోస్తొంది. దానికి ప్రదక్షిణం, నమస్కారం సమపించారు. అంటే మనమేం అర్ధం చేసుకోవాలి? ఎంత ముఖ్యమైన పని మీద వెళుతున్నా, పరోపకారం చేసేవారు, నలుగురి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసేవారు, గొప్పవారు, పూజ్యులు, దేవతలు కనిపించగానే ముందు వారికి నమస్కరించాలి. వారి ఆశీర్వాదం తీసుకుని ముందుకు వెళ్ళాలి. 

ఇక వెత్తుక్కుంటూ ఈశాన్య(ఉత్తర-తూర్పు మధ్య ప్రదేశం) దిక్కుకు వెళ్ళారు. అక్కడ తపోవనంలో మహాతేజో మూర్తి కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నారు. ఆయన ప్రక్కనే గుర్రం గడ్డిమేస్తూ కనిపించింది. వాళ్ళనుకున్నారు ఈయనే గుర్రాన్ని అపహరించి ఉంటారు. ఈయనే దొంగ అన్నారు. మనకు రామాయణం ఇస్తూన సందేశం ఏమిటి? ఆధారం లేకుండా ఎవరినిపడితే వారిని, ముఖ్యంగా మహాత్ములను నిందించకూడదు. వారి గురించి లేనిపోని మాటలు మాట్లాడకూడదు. లేనిపోని అభాంఢాలు వేయకూడదు. సుభాషితాలు కూడా అదే అంటూన్నాయి. సాధుపురుషులు, మాహత్ముల జోలికి వెళ్ళి, వారిని ఇబ్బంది పెట్టి, దూరంగా పారిపోయి తప్పించుకుందాం అనుకుంటున్నారేమో. సాధుపరుషులు చేతులు చాలా పెద్దగా ఉంటాయి. ఎంతదూరం పారిపోయిన వారి చేతుల నుండి తప్పించుకోలేరు అంటున్నాయి. అటువంటిది ఈ 60,000 మంది అనవసరంగా ఆయనను నిందించడమే కాదు చేతులలో గునపాలు, నాగళ్ళు ధరించి కపిల మహర్షి మీద దాడి చేయడానికి ఆయన మీదకు దూసుకెళ్ళారు.